కారప్పూస


కావలసిన పదార్థాలు :
శనగ పిండి—1కేజీ
బియ్యపు పిండి—1కేజి
వెన్న పూస-200గ్రాములు
పచ్చి కారం-3 పెద్ద స్పూనులు
వాము- 100గ్రాములు
తయారీ విధానం:
కారప్పూస తయారీకి పిండులు జల్లించుకోవాలి. వాము కూడా మిక్సీ పట్టి పిండి జల్లించుకోవాలి. లేకపోతే అచ్చుల్లోని కన్నాలు పూడుకుపోతాయి.
ముందుగా ఒక బేసిను లేదా వెడల్పాటి పళ్ళెం తీసుకొని దానిలో పిండులు, కారం,వాము పొడి, తగినంత ఉప్పు వేసి కలపాలి. పిండి సమానంగా కలవాలి. ఒకసారి పిండి రుచి చూసి ఉప్పు,కారం సరి చూసుకోండి.
వెన్నపూస కరగబెట్టి పైన పిండిలో కలపాలి. వెన్నపూస వెయ్యడం వల్ల చక్కిరాలు గుల్లగా వస్తాయి.
ఇప్పుడు పిండి ఒక డబ్బాలోకి తీసుకుని, దానిలో కొంత భాగం పళ్ళెంలోకి తీసుకొని నీళ్ళతో చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండి మొత్తం ఒకేసారి కలపడం కష్టం కాబట్టి కొంచెం కొంచెం కలుపుకోవాలి.
వెడల్పాటి మూతిగల లోతు తక్కువ గల మూకుడు తీసుకొని సగం వరకు నూనె పోసి పెద్ద సెగ మీద కాగనివ్వాలి.
పిండి ముద్దని అచ్చుల్లో కూరి వేడి నూనెలోకి వత్తుతూ గుండ్రంగా తిప్పాలి.  అచ్చులకు లోపలివైపు కొంచెం నూనె పూస్తే పిండి  తేలికగా జారుతుంది. పిండిని మరీ జారుగా బజ్జీపిండిలా కలపవద్దు.
ఇప్పుడు అచ్చుల్లో చాలా రకాలు వచ్చేసాయి. సాంప్రదాయ అచ్చుతో వత్తడం చాలా కష్టం. ఉత్తరభారతీయులు వాడే అచ్చు కొంచెం తేలికగా ఉంటుంది. దీనికి పైన మర వలే ఉంటుంది. దీనిని తిప్పుతూ ఉంటే పిండి కిందకు దిగుతుంది. ఇంకో సులువైన అచ్చు- దీనికి పక్కన గన్ను లాగా ఉంటుంది. దీనిని నొక్కితే చాలు పిండి బయటకు వస్తుంది.  కింద బొమ్మల్లో చూడండి.
కారప్పూస సన్నగా ఉంటుంది కాబట్టి కాలడానికి ఎక్కువ సమయం పట్టదు. చక్కిరాలు కొంచెం సమయం తీసుకొంటాయి.కాలిన చక్కిరాలను నిల్వ చేసే డబ్బాలో కాకుండా వేరే పళ్ళెంలోకి తియ్యండి. నూనె జారిపోయాక డబ్బాలోకి తీసుకోవచ్చు.
చక్కిరాలు గుల్లగా రావాలంటే శనగపిండి 2 వంతులకి బియ్యం పిండి ఒక వంతు తీసుకోవాలి.
అచ్చుల్లో చిన్న ప్లేట్లు ఇస్తాడు వాటిలో కావలసిన షేపు ఎంచుకోవచ్చు. కారప్పూసకి మరీ సన్న కన్నా లు అంటే మిక్చరులో వేసే వాటి లాగా ఎంచుకోవద్దు పిండి వత్తడం కష్టం అవుతుంది.
బియ్యం పిండి బియ్యం కడిగి ఎండలో ఆరబెట్టి మర పట్టిస్తారు.  లేకపోతే సూపర్ మార్కెట్లో కొనవచ్చు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు